న్యూఢిల్లీ : మోదీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని రాజస్ధాన్ కాంగ్రెస్ ఇన్చార్జ్ అజయ్ మాకెన్ వెల్లడించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొంటారని చెప్పారు. ఈ ర్యాలీకి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హాజరవుతారా లేదా అనేది ఇంకా వెల్లడికాలేదని తెలిపారు.
మోదీ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్ చేపడుతున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలో ద్రవ్యోల్బణం ఎగబాకుతూ ధరల మంట మోతెక్కుతోందని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు కుప్పకూలాయని, నక్సలిజం, టెర్రరిజం వ్యాప్తి చెందుతున్నాయని, నల్లధనాన్ని ప్రభుత్వం అరికట్టలేకపోతోందని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ రేటు పదిశాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్ ర్యాలీలో కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పలు చర్యలు చేపడతామని రాజస్ధాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ తెలిపారు.