Haryana Congress : హరియాణాకు సంబంధించి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై కాంగ్రెస్ వేటు వేసింది. ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హరియాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రావ్ నరేందర్ సింగ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. పునహానా ఎమ్మెల్యే మొహమ్మద్ ఇల్యాస్, హతిన్ ఎమ్మెల్యే మొహమ్మద్ ఇజ్రయిల్, సదౌరా ఎమ్మెల్యే రేనే బాలా, నారయణ్ ఘర్ ఎమ్మెల్యే షాల్లీ చౌదరి, రతియా ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ అంశంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ధరంపాల్ మాలిక్ ఆధ్వర్యంలోని హరియాణా క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు ఐదుగురిపై వేటు వేసినట్లు పార్టీ పేర్కొంది. ఇటీవల హరియాణాలో ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరిగాయి. రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నప్పటికీ, ఇతర పార్టీ వారికి ఓటేశారు. పార్టీ నియమావళి, విప్ ధిక్కరిస్తూ వీరు ఈ పని చేశారు. దీనిపై విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ.. ఐదుగురు నిందితులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్లు గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడికి సూచించింది.
దీంతో బాధ్యులైన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వారికి పార్టీతో ఎలాంటి సంబంధం ఉండదని, పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకోకూడదని తెలిపింది. అయితే, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను సస్పెండైన ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. తాము ఎలాంటి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని, కాంగ్రెస్ అభ్యర్థులకే ఓటేశామని తెలిపారు.