Jai Ram Ramesh | మహారాష్ట్రలోని అధికార కూటమి ‘మహాయుతి’ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ద్రోహంతో కొలువు దీరిన మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలను మహారాష్ట్ర ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. బీజేపీ, శివసేన (ఏక్ నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) సారధ్యంలోని మహాయుతి సర్కార్ హయాంలో రైతులు అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. 2019లో అప్పటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల ప్యాకేజీతో ప్రతి పల్లెకు పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారని జైరాం రమేశ్ గుర్తు చేశారు. గత వేసవికల్లా ఐదేండ్లు పూర్తయినా ఫడ్నవీస్ తన హామీ నిలుపుకోలేకపోయారని, ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని చెప్పారు.
మరఠ్వాడాలో ప్రతి గ్రామానికి తాగునీటి పంపిణీకి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయలేదని జైరాం రమేశ్ ఆరోపించారు. 600 పై చిలుకు గ్రామాలు, 178 చిన్న గ్రామాలు నీటి కొరత ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జల యుక్త్ శివిర్ అని హామీలు ఇచ్చిన మహాయుతి సర్కార్ దాన్ని జల్ ముక్త్ శివిర్ గా మార్చేశారన్నారు.