K.Muralidharan : కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశి థూరూర్ (Shashi Tharoor)కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు నేతులు బాహాటంగానే ఆయనను విమర్శిస్తుండగా.. తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే.మురళీధరన్ (K.Muralidharan) కుండబద్ధలు కొట్టారు. ఇకపై థరూర్ మాలో ఒకరు కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ థరూర్‌ను దూరం పెట్టేందుకు సిద్ధమవుతుందనే వార్తలు నిజమేనని అర్ధమవుతోంది.
‘థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నాం. అందుకే తిరువనంతపురంలో మేము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడైన థరూర్ ఇకపై మాలో ఒకరు కాదు. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుంది’ అని మురళీధరన్ అన్నారు. కానీ, థరూర్ మాత్రం ఈ పరిణామంపై ఇంకా స్పందించలేదు.
భారత సైన్యానికి, మోడీ ప్రభుత్వానికి మద్దతు పలకడమే థరూర్ చేసిన నేరం అని మురళీధరన్‌తో పాటు కాంగ్రెస్ నేతలంతా భావిస్తున్నారు. అయితే.. ఎంపీ మాత్రం దేశ భద్రతా దృష్ట్యా ఇతర పార్టీలకు సపోర్టు చేయడాన్ని సొంత పార్టీవాళ్లు నమ్మకద్రోహంగా పరిగణిస్తారని ఇదివరకే చెప్పారు. థరూర్ తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.