Air India Crash : ఎయిరిండియా విమాన ప్రమాదంపై విదేశీ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) ఖండించారు. పైలట్ పొరపాటు వల్లే ఘోర ప్రమాదం అంటూ అమెరికాకు చెందిన ది వాల్ స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal), రైటర్స్ (Reuters) సంస్థలు వార్తలు ప్రచురించడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం మాట్లాడిన ఆయన.. తనకు విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ (AAIB)పై పూర్తి విశ్వాసం ఉందని.. స్వలాభం కోసమే పాశ్చాత్య మీడియా ఈ ఘటనపై అసత్య కథనాలు ప్రచారం చేస్తుందని అన్నారు.
‘నాకు ఏఏఐబీపై పూర్తి నమ్మకం ఉంది. ప్రమాదానికి దారితీసిన కారణాలను ఆ సంస్థ కనుగొంటుందని విశ్వసిస్తున్నా. భారత్లో డేటాను డీకోడింగ్ చేయడంలో వాళ్లు సఫలీకృతం అయ్యారు. నిజంగా ఇది అతి పెద్ద విజయం. మరో విషయం.. ఏఏఐబీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య మీడియా సంస్థలు తమ సొంత ప్రయోజనాల కోసం ఎయిరిండియా ప్రమాదంపై పనిగట్టుకొని మరీ అసత్య కథనాలను వెలువరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ వైఖరి మానుకోవాలని కోరుతున్నాం’ అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
#WATCH | Ghaziabad, UP | Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, “AAIB has made an appeal to all, especially Western media houses, which may have a vested interest in the kind of articles they are trying to publish. I believe in AAIB… They have done a wonderful… pic.twitter.com/24Ic9XTkiN
— ANI (@ANI) July 20, 2025
విమాన ప్రమాదానికి కారణాలను విశ్లేషించే బాధ్యత ఏఏఐబీ తీసుకున్నందున ఊహాగానాలను ప్రచారం చేయొద్దని మంత్రి కోరారు. ‘తుది నివేదిక వచ్చేంత వరకూ ఎవరూ కూడా ఊహాజనిత కామెంట్లు చేయొద్దు. అందుకే మేము దర్యాప్తు సవ్యంగా జరిగేలా చూసుకుంటున్నాం. రిపోర్టు వచ్చాకే అన్ని విషయాలు తెలుస్తాయి’ అని మంత్రి పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జూన్ 12న ఎయిరిండియా బోయింగ్ 171 విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 230 మంది ప్రయాణికుల్లో విశ్వాస్ కుమార్ అనే ఒక వ్యక్తి మినహా అందరూ మృత్యువాత పడ్డారు.12 మంది సిబ్బంది కూడా దుర్మరణం చెందారు.