KTR | హైదరాబాద్ : బీహార్లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. అయితే ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. బీహార్లో జరుగుతున్న పరిణామాల పట్ల మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. జైపూర్లో జరుగుతున్న టాక్ జర్నలిజం చర్చా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
భారతదేశంలో రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం చాలా సులభం. వారు, మనము అని ప్రజలను విడగొట్టే రాజకీయ కుట్రలకు అనుగుణంగా బీహార్ పరిణామాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతుంది. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన, నిరసన తెలపనంత మాత్రాన అంతా బాగుందని అనుకోవద్దు. ఈ దేశంలోని ఓటర్లు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. నగరాల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉండడం కూడా ఇందుకు ఒక కారణం అని కేటీఆర్ అన్నారు.
ఎన్నికల తరువాత ఫలితాల మీద మాట్లాడటం కంటే ఎన్నికలకు ముందే ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలి. ఇండియా లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి ఓటు కోల్పోయిన కూడా దానిమీద చర్యలు తీసుకోవాలి. బీహార్లో ఐదు లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని అంటున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం 12,500 ఓట్ల తేడాతోనే అక్కడ ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయింది. భారతీయత మాత్రమే దేశంలోని కోట్లాది మందిని కలిపి ఉంచగలుగుతుంది. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం అని కేటీఆర్ పేర్కొన్నారు.