న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఈడీ ముందు తమ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విషయాలను దాచడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తమ పార్టీ చట్టానికి కట్టుబడి ఉంటుందని పేర్కొంది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నందున దర్యాప్తు ఏజెన్సీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని సోనియా గాంధీ ఈడీని కోరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది.
నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్‌కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసుకు సంబంధించి బుధవారం తమ ఎదుట హాజరు కావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. తాము చట్ట నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఈడీ సమన్లు జారీ చేస్తే వారు (సోనియా, రాహుల్) దర్యాప్తు ఏజెన్సీ ఎదుట హాజరవుతారని, ఈడీ నుంచి ఎలాంటి వివరాలను తమ నేతలు దాచబోరని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా స్పష్టం చేశారు. తాము బీజేపీలా వ్యవహరించబోమని 2002 నుంచి 2013 వరకూ అమిత్ షా కేసుల విషయంలో ఎలా పరుగులు పెట్టారో తెలుసని గుర్తుచేశారు.
ఇక రాహుల్ గాంధీని ఈనెల 13న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. గతంలో జూన్ 2న ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా విదేశీ పర్యటనలో ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇక సోనియా, రాహుల్‌లకు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ అంతకుముందు ఘాటుగా స్పందించింది. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. జీడీపీ పతనం, ద్రవ్యోల్బణం, సామాజిక అశాంతి, మత చిచ్చు వంటి ఎన్నో సమస్యలతో జనం అల్లాడుతుంటే వాటిని కప్పిపుచ్చుకునేందుకు నకిలీ ఏజేఎల్ కేసును తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.