న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ ఖట్మండు నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వీడియోను విడుదల చేసిన కాషాయ పార్టీ విపక్ష నేత లక్ష్యంగా విమర్శలు గుప్పించడంపై కాంగ్రెస్ దీటుగా స్పందించింది. ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో రాహుల్ గాంధీ ఆహ్వానించకపోయినా పాకిస్తాన్‌కు వెళ్లలేదని బదులిచ్చింది. నేపాల్‌లోని నైట్ క్లబ్లో సందడి చేస్తున్న రాహుల్ వీడియోను మంగళవారం ట్వీట్ చేసిన బీజేపీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసింది.
కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విరుచుకుపడే రాహుల్ గాంధీ ఓ పార్టీలో మునిగితేలుతున్నారని కాషాయ పార్టీ ఎద్దేవా చేసింది. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా తోసిపుచ్చారు. 2015లో పాక్ మాజీ ప్రదాని నవాజ్ షరీఫ్ కూతురు పెండ్లికి అనుకోని అతిధిలా మోదీ హాజరవడాన్ని ఆయన ప్రస్తావించారు.
పిలవని కార్యక్రమానికి నరేంద్ర మోదీ తరహాలో రాహుల్ గాంధీ పాకిస్తాన్‌కు వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ బర్త్‌డే వేడుకల్లో కేక్ కట్ చేయలేదని మన మిత్రదేశం నేపాల్‌లో ఫ్రెండ్ పెండ్లికి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారని సుర్జీవాలా చెప్పుకొచ్చారు. ఆ ఫ్రెండ్ వృత్తిరీత్యా జర్నలిస్టని అన్నారు. మన దేశంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల పెండ్లిండ్లు, శుభకార్యాల్లో పాల్గొనడం మన సంస్కృతిలో భాగమని, పెండ్లికి హాజరవడం ఈ దేశంలో ఇంకా నేరం కాదని అన్నారు. ఇప్పటి నుంచి పెండ్లి వేడుకలకు హాజరవడం చట్టవిరుద్ధమని ప్రధాని మోదీ, కాషాయ నేతలు నిర్ణయిస్తారేమో అని వ్యాఖ్యానించారు.