Congress : తనపై దాడులు చేపట్టేందుకు ఈడీ సిద్ధమవుతున్నదని, ఆ సంస్ధలో విశ్వసనీయ వ్యక్తులు తనకు ఈ సమాచారం అందించారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపధ్యంలో విపక్షాలు ఆయనకు బాసటగా నిలిచాయి. తాము రాహుల్ వెన్నంటి నిలుస్తామని సంఘీభావం ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్రం విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉసిగొల్పి దాడులు చేయిస్తోందని, ఈ బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడరని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ మోదీ సర్కార్ లక్ష్యంగా చక్రవ్యూహం వ్యాఖ్యలతో విరుచుకుపడిన క్రమంలో రాహుల్పై దాడికి తెగబడాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు.
మోదీ, బీజేపీ ప్రభుత్వం తొలి పదేండ్లలో ఈడీ, సీబీఐ, ఐటీని దుర్వినియోగం చేసి విపక్ష నేతల ప్రతిష్టను మంటగలిపేందుకు ప్రయత్నించడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ప్రజలు బీజేపీని పక్కనపెట్టి మెజారిటీ తగ్గించారని, 303 సీట్ల నుంచి కాషాయ పార్టీ సంఖ్యా బలం 240కి పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ, జేడీ(యూ) మద్దతుతో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. మోదీ సారధ్యంలోని ప్రస్తుత ప్రభుత్వం బలహీనమైనదని, మోదీ బలహీన ప్రధాని అన్నది అందరికీ తెలిసిందేనని తెలిపారు.
రాహుల్ గాంధీ నివాసంపై దాడికి కుట్ర జరుగుతున్నదని అధికారుల్లో కొందరు విపక్ష నేతకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడరని మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దాచిందేమీ లేదని, చక్రవ్యూహ స్పీచ్తో ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం ఆయనను టార్గెట్ చేస్తోందని, దీనిపై తాను ఇవాళ వాయిదా తీర్మానం ఇస్తానని చెప్పారు. ఈడీ అధికారులు తన నివాసంపై దాడి చేసేందుకు పూనుకున్నారని సమాచారం రాహుల్ గాంధీకి తెలిసిందని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ప్రభుత్వం ముందు సాగిలపడ్డాయని ఆమె ఆరోపించారు.
Read More :
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?