న్యూఢిల్లీ, మార్చి 8: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ శుక్రవారం తొలి జాబితా విడుదల చేసింది. 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తన సిట్టింగ్ స్థానమైన కేరళలోని వాయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలో సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్(కేరళలోని అలప్పుజ), శశిథరూర్(తిరువనంతపురం)కు చోటు కల్పించింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం బూపేశ్ బఘేల్‌ను ఆ రాష్ట్రంలోని రాజ్‌నందగావ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నది. తొలి జాబితాలో భాగంగా తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
11 రాష్ర్టాల్లోని 60 లోక్‌సభ స్థానాలపై గురువారం సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ అధిష్ఠానం.. చివరకు 39 మంది అభ్యర్థులతో మొదటి లిస్టును విడుదల చేయడం గమనార్హం. తొలి లిస్టులో 28 సీట్లు దక్షిణాది రాష్ర్టాలకు చెందినవే కావడం గమనార్హం. అందులో కేరళలో 16, కర్ణాటకలో 7 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.