Amith Shah | న్యూఢిల్లీ: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. షా వ్యాఖ్యలు అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని అవమానించడమేనని విపక్ష పార్టీల నేతలు కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.
అమిత్ షా తన పదవికి రాజీనామా చేసి, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో షా వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు జరిగాయి. మహారాష్ట్రలోని లాతూర్లో వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ) నేతృత్వంలో అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే షాపై ఆయన రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ను అవమానించిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం పేర్కొన్నారు.