సుర్గుజా: చత్తీస్‌ఘడ్‌లోని సుర్గుజాలో జరిగిన విజయ సంకల్ప శంకనాథ్ మహార్యాలీలో పాల్గొని ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. కాంగ్రెస్ అడ్వైజర్ సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. వారసత్వ పన్నును వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోందని ఆయన ఆరోపించారు. తల్లితండ్రులకు చెందిన ఆస్తులు.. తమ పిల్లలకు కేవలం 50 శాతం మాత్రం వెళ్లాలని, మిగితా 50 శాతం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లాలని పిట్రోడా ఇటీవల కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రమాదకర ఆలోచనలు ఉన్నాయని మోదీ ఆరోపించారు.
మధ్యతరగతి ప్రజల వద్ద అధిక మొత్తంలో పన్నులు వసూల్ చేయాలని గాంధీ కుటుంబానికి చెందిన సలహాదారుడు కామెంట్ చేశారని, ఇప్పుడు మరింత దూకుడుగా ఆయన మాట్లాడారని, వారసత్వ సంపదపై పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోందని మోదీ ఆరోపించారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును మీ పిల్లలకు ఇవ్వకుండా లాక్కునే ప్లాన్ కాంగ్రెస్ చేస్తోందని, బ్రతికి ఉన్నప్పుడు లూటీ చేయడమే కాకుండా మరణించిన తర్వాత కూడా లూటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. బ్రతికున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ట్యాక్సును వసూల్ చేస్తుందని, చనిపోయిన తర్వాత కూడా వారసత్వ ట్యాక్స్‌ను వసూల్ చేస్తుందని ఆయన ఆరోపించారు.