హిసార్: హర్యానాలోని హిసార్‌లో ఉన్న మహారాజ అగ్రసేన్ విమానాశ్రయంలో కొత్త టర్మినల్ బిల్డింగ్‌కు ఇవాళ ప్రధాని మోదీ (PM Modi)శంకుస్థాపన చేవారు. సుమారు 410 కోట్ల ఖర్చుతో ఆ టర్మినల్‌ను నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. అధికారాన్ని పొందేందుకు రాజ్యాంగాన్ని ఓ పనిముట్టు తరహాలో కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందన్నారు. ఎక్కడ తమ అధికారానికి సంక్షోభం ఏర్పడిందో అక్కడ ఆ పార్టీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసిందన్నారు. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేస్తూ.. అధికారాన్ని మళ్లీ రాబట్టుకునేందుకు రాజ్యాంగ స్పూర్తిని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి అన్నీ దక్కేలా చూడడం రాజ్యాంగం ఉద్దేశం అని, కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయలేకపోయిందన్నారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమలుకు ప్రతిపక్షం సహకరించాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ పార్టీ దాన్ని బుజ్జగింపు రాజకీయాలకు వాడుకుందన్నారు. ఇటీవల కర్నాటకలోని కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ టెండర్ల కోసం మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించిందని విమర్శించారు. రాజ్యాంగంలో అలాంటి వెసలుబాట్లు లేకున్నా అక్కడి ప్రభుత్వం అలా చేసిందని విమర్శించారు. బుజ్జగింపు విధానాల వల్ల ముస్లిం వర్గానికి అన్యాయం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వక్ఫ్ చట్టాలను అమలు చేయలేదన్నారు. 2013లో, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముస్లిం వర్గాన్ని ఆకట్టుకునేందుకు వక్ప్ చట్టాన్ని కాంగ్రెస్‌పార్టీ సవరణ చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను పట్టించుకోలేదని, ఒకవేళ ఆ పార్టీ ఆ వర్గం గురించి ఆలోచించి ఉంటే, పార్టీ ప్రెసిడెంట్‌గా ముస్లింను నియమించేదని లేదంటే ముస్లిం అభ్యర్థులకే 50 శాతం టికెట్లు ఇచ్చేదన్నారు. ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదన్నారు.
ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వక్ఫ భూముల్ని కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇవ్వలేదని, కానీ ఆ భూముల్ని ల్యాండ్ మాఫియా వాడుకుంటోందన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనలు భూముల్ని మాఫియాలు ఆక్రమిస్తున్నాయని, కానీ పాశ్మాండ ముస్లిం వర్గాలను ఎటువంటి లాభం చేయకుండా వదిలేసినట్లు చెప్పారు. వక్ఫ్ చట్ట సవరణ ద్వారా అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు చెప్పారు. గిరిజన భూముల్ని వక్ఫ్ బోర్డు తాకలేదని ప్రధాని పేర్కొన్నారు.