బెంగళూరు, సెప్టెంబర్ 30: కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పిండడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మించిపోయింది. గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 40 శాతం కమీషన్లు వసూలు చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేసేందుకు అంతకు రెట్టింపు కమీషన్లు పిండుతోందని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్‌సీఏ) చేసిన తాజా ఆరోపణలు రాష్ట్రంలో రాజకీయ దుమారానికి దారితీశాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష బీజేపీ రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఏటీఎం సర్కార్‌గా అభివర్ణించింది.
2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అవినీతిని ప్రధాన నినాదంగా చేసుకున్న కాంగ్రెస్ లబ్ధిపొంది అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేసేందుకు అప్పట్లో బీజేపీ సర్కార్ 40 శాతం కమీషన్లు తీసుకుంటే ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం 80 శాతం కమీషన్లు తీసుకుంటోందని కేఎస్‌సీఏ ఆరోపించింది. పెండింగ్ బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ కాంట్రాక్టర్ల సంఘం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ కూడా రాసింది.
కాంగ్రెస్ పాలనలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుందని ఇటీవల సిద్ధరామయ్యకు రాసిన లేఖలో కేఎస్‌సీఏ ఆరోపించింది. బీజేపీ పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలోని కనీసం 8 శాఖలలో కమీషన్లు రెట్టింపు అయ్యాయని సంఘం అధ్యక్షుడు ఆర్ మంజునాథ్, ప్రధాన కార్యదర్శి జీఎం రవీంద్ర సంతకాలతో కూడిన లేఖ పేర్కొంది. మా పార్టీ అధికారంలోకి వస్తే బిల్లులు క్లియర్ చేసేందుకు కమీషన్లు కోరబోమని ప్రతిపక్ష నాయకుడిగా అప్పట్లో మీరు(సిద్ధరామయ్య) చెప్పారు. అయితే 8 శాఖలలో కమీషన్లు రెట్టింపు అయ్యాయని తెలియచేసేందుకు చింతిస్తున్నాము అని కేఎస్‌సీఏ తన లేఖలో ఆరోపించింది. ముడుపులు చెల్లించిన బిల్లులనే ప్రభుత్వం ఆమోదిస్తోందని కూడా వారు తమ లేఖలో ఆరోపించారు.