Congress | న్యూఢిల్లీ, మార్చి 13: లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి రూ.లక్ష చొప్పున నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 50 శాతం కోటా ఇస్తామని ప్రకటించింది. ‘నారీ న్యాయ్’ పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఐదు గ్యారెంటీలను బుధవారం ప్రకటించారు. ‘శక్తి కా సమ్మాన్’ కింద.. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన వర్కర్లకు అందుతున్న జీతంలో, కేంద్రం వాటా రెట్టింపు చేస్తామన్నారు. ప్రతి పంచాయతీలో ‘అధికార మైత్రి’ని నియమిస్తామన్నారు. అలాగే ప్రతి జిల్లాలో సావిత్రీబాయి పూలే హాస్టళ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.