న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర సర్కారుపై పదునైన విమర్శలు చేసిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గురువారం సాయంత్రం అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానం ఇస్తూ.. రాహుల్‌గాంధీపైన, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపైన, ఇతర విపక్ష పార్టీలపైన తీవ్ర విమర్శలు చేశారు. అవహేళనగా మాట్లాడారు. దాంతో ప్రధాని ప్రసంగిస్తుండగానే రాహుల్‌గాంధీ సహా విపక్ష సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ ప్రెస్‌మీట్ పెట్టడంపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
లోక్‌సభలో తన గురించి, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల గురించి ప్రధాని మోదీ చేసిన విమర్శలను తిప్పికొట్టడానికే రాహుల్‌గాంధీ ప్రెస్‌మీట్ పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లోక్‌సభలో ప్రధాని ప్రసంగం పూర్తిగా ‘ఆత్మస్తుతి, పరనింద’ అన్నట్లుగా సాగిన నేపథ్యంలో.. ప్రెస్మీట్లో రాహుల్‌గాంధీ మోదీ తీరును ఎండగట్టనున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.