KC Venugopal | కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఈ విమానాన్ని దారి మళ్లించి చెన్నై ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇదే విమానంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురు ఎంపీలు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏఐ 2455 విమానంలో తలెత్తిన సాంకేతిక లోపంపై ఎయిరిండియా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రతికూల వాతావరణం, సాంకేతిక సమస్యతో విమానాన్ని చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్లు పేర్కొన్నారు. రాత్రి 7.15 గంటలకు బదులు 8.17 గంటలకు అంటే గంట ఆలస్యంగా విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. దాంతో చెన్నై ఎయిర్‌పోర్టుకు విమానాన్ని మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశామని తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానానికి అవసరమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ స్పందించారు. ఆదివారం రాత్రి తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ఎయిరిండియా ఫ్లైట్ ఏఐ 2455 బయల్దేరాం. నాతో పాటు పలువురు ఎంపీలు, వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం బయల్దేరిందే ఆలస్యంగా అంటే.. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తిందని హెచ్చరిక. సిగ్నల్ సమస్య తలెత్తింది.. ఫ్లైట్‌ను చెన్నై ఎయిర్‌పోర్టుకు మళ్లిస్తున్నట్లు కెప్టెన్ ప్రకటించారు. దీంతో అందరిలోనూ భయానక వాతవరణం నెలకొంది. రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండైంది. దాంతో అందరం ఊపిరి పీల్చుకున్నామని కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. కెప్టెన్ నిర్ణయం వల్ల అందరం ప్రాణాలతో బతికి బయటపడ్డామని కేసీ వేణుగోపాల్ అన్నారు. మేమంతా అదృష్టవంతులం అని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డీజీసీఏ, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను కేసీ వేణుగోపాల్ కోరారు.