న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం నాలుగో సారి ప్రశ్నించారు. మరోవైపు రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.
ధర్నాలో పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, వి నారాయణ స్వామి, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సహా పలువురు దిగ్గజ నేతలు పాల్గొన్నారు. పార్టీ సత్యాగ్రహ దీక్ష శిబిరానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ విచారణకు వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో మాన్ సింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇక రాహుల్ విచారణకు నిరసనగా శివమొగ్గలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రైల్ రోకో చేపట్టగా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.