Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఒక్కో ఆడబిడ్డ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 2,500 చొప్పున జమ అవుతుందట. ‘మహాలక్ష్మి పథకం’ కింద రేవంత్ ప్రభుత్వమే ఈ ఆర్థిక సాయం చేస్తుందట. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? మా అకౌంట్లో డబ్బు ఎప్పుడు జమైందంటూ షాక్ అవుతున్నారా?? మీ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కానప్పటికీ.. దేశం మొత్తం మాత్రం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు వేస్తుందనే అనుకొంటున్నది. ఎందుకంటే జాతీయ మీడియా ‘ఆజ్‌తక్’లో నిర్వహించిన ఓ చర్చా వేదికలో కాంగ్రెస్ ఐటీసెల్ హెడ్ సుప్రియా శ్రీనేథ్ ఇవే అబద్ధాలను వల్లె వేశారు మరి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో అక్కడ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే అలవిగాని హామీలను కురిపించింది. తాము అధికారంలోకి వస్తే ‘ప్యారీదీదీ యోజన’ పేరిట ఢిల్లీ మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీంతో ఈ స్కీమ్‌ను ఎలా అమలు చేయగలరని చర్చలో భాగంగా న్యూస్ యాంకర్ ప్రశ్నించారు. దీనిపై సుప్రియా స్పందిస్తూ.. ‘కర్ణాటకలోని 1.28 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. తెలంగాణలో 90 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను ప్రారంభించాం’ అని చెప్పారు. కాగా, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న ఆర్థిక సాయాన్ని ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా జమచేయలేదు. అంతేకాదు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క గ్యారెంటీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఇలా అబద్ధాలు వల్లెవేయడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.