NITI Aayog Meeting : నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ఊదరగొట్టగా ఎన్నికల అనంతరం ఈ ప్రచారానికి ఆయన స్వస్తి పలుకుతారని భావించామని అన్నారు. కానీ రాష్ట్రాల పట్ల ఆయన వివక్ష ప్రదర్శించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని మాట్లాడేందుకు అనుమతించకుండా మైక్ కట్ చేశారని దీంతో ఆమె వాకౌట్ చేశారని చెప్పారు. ఇక బడ్జెట్లోనూ మోదీ సర్కార్ వివక్ష ప్రదర్శించిందని విమర్శించారు. రాజస్ధాన్, మహారాష్ట్రలో బీజేపీకి ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కేంద్ర బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు మొండిచేయి చూపారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఆధారపడిన రెండు రాష్ట్రాలకు మాత్రం మెరుగైన కేటాయింపులు దక్కాయని ఏపీ, బిహార్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
ప్రధాని వివక్ష వైఖరిని నిరసిస్తూ తాము నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించామని పవన్ ఖేరా వివరించారు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. పార్లమెంట్లో విపక్ష నేతల మైక్ కట్ చేయడం ఇప్పటివరకూ చూశామని, ఇక నీతి ఆయోగ్ సమావేశంలోనూ సీఎంల మైక్‌లు కట్ చేయడం వరకూ కాషాయ పాలకులు వెళ్లడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
Read More :
Road Damage | గోషామహల్లో కుంగిన రోడ్డు..బోల్తా పడిన డీసీఎం : వీడియో