న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress ) ప్రధాని మోదీపై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. ఇది మన్ కీ బాత్ కాదని, మౌన్ కీ బాత్ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. చైనా, అదానీ వంటి అంశాలపై ఇది మౌన్ కీ బాత్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ అంటూ హంగామా చేస్తున్నారని, కానీ చైనా, అదానీ, పెరుగుతున్న ఆర్ధిక అసమానతలు, నిత్యావసరాల ధరల మంట, జమ్ము కశ్మీర్లో ఉగ్ర దాడులు, మహిళా రెజ్లర్లపై వేధింపులు, రైతు సంఘాలకు ఇచ్చిన హామీల విస్మరణ, కర్నాటక వంటి డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లో అవినీతి వంటి అంశాల్లో ఆయన నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
మన్ కీ బాత్‌ను మౌన్ కీ బాత్‌గా అభివర్ణిస్తూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇక నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళల భద్రత వంటి అంశాలపై బీజేపీ మౌనం దాల్చిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఇక అంతకుముందు మన్ కీ బాత్ వందో ఎపిసోడ్‌ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర విమర్శలు గుప్పించారు. మోదీజీ..కాషాయ భక్షకుల నుంచి మహిళా అధ్లెట్లను ఎందుకు కాపాడటం లేదని ఆమె నిలదీశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా అదానీ వ్యవహరంపై విచారణను సెబీ ఎందుకు పూర్తిచేయలేకపోయిందని ట్విట్టర్ వేదికగా టీఎంసీ ఎంపీ ప్రశ్నించారు.
Read More