PM Modi : కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ మారిందని తెలిపారు. ఓటర్లు సుపరిపాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారని, బీహార్ ఎన్నికలు.. తిరువనంతపురం, ముంబయి స్థానిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమయ్యిందని చెప్పారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. కలియాబోర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించినప్పటికీ కాంగ్రెస్కు అభివృద్ధి అజెండా లేదని, అందువల్లే ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్ తన రాజకీయాల కోసం భారత వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో జట్టు కట్టిందని ఆరోపించారు.
చొరబాటుదారుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అస్సాంలో వారికి ఆశ్రయమిచ్చిందని ప్రధాని చెప్పారు. ఆ పార్టీ హయాంలో పెద్ద మొత్తంలో చొరబాటుదారులు రాష్ట్రంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పెంచి, పోషించిన అక్రమ వలసదారులు ప్రజల భూములు ఆక్రమించుకుంటున్నారని చెప్పారు. వారి సంస్కృతిపై దాడి చేస్తున్నారని అన్నారు.
దీనివల్ల అస్సాం ప్రజల అస్తిత్వం ప్రమాదంలో పడిందని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.