ముంబై, అక్టోబర్ 11: మహారాష్ట్ర కాంగ్రెస్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుబులు పట్టుకున్నది. తెలంగాణ దుష్పరిపాలనా ప్రభావం తమపై పడుతుందనే ఆందోళన అక్కడి కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని వైనం తమ మెడకు చుట్టుకుంటుందని వారు కలవరపడుతున్నారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగిన గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చే పద్ధతిని కాంగ్రెస్ పాటిస్తున్నది. అయితే, మహారాష్ట్రలో గ్యారెంటీల పేరెత్తితే ప్రజలు తమను నిలదీస్తారేమోనని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందూవెనుకా ఆలోచించుకోకుండా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అమలు చేయలేదు. నిజామాబాద్ నుంచి గడ్చిరౌలి దాకా ఉన్న మహారాష్ట్రలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శంభాజీనగర్(ఔరంగాబాద్), సోలాపూర్, చంద్రాపూర్, కోల్హాపూర్ ప్రాంతాలు తెలంగాణకు సరిహద్దున ఉన్నాయి. ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ సర్కారు వైనంపై మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల ప్రజలకు మంచి అవగాహన ఉంది.
రేవంత్ మాడల్ ‘మహా’ కాంగ్రెస్ గుండె గుబేల్
మహారాష్ట్రలో పార్టీలను చీల్చడం పట్ల బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇది కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలకు రేవంత్ పాలనా తీరు ఎక్కడ గండికొడుతుందోనని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో 10 నెలలుగా రేవంత్ సర్కారు ఎన్నికల హామీలు అమలు చేయలేదు. ఈ విషయం బాగా తెలిసిన సరిహద్దు ప్రజలు తాము గ్యారెంటీల పేరుతో హామీలు ఇస్తే నమ్మకపోగా, తిరగబడతారనే ఆందోళన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్నది. పైగా బీజేపీ కూడా తెలంగాణను ఉదాహరణకు చూపుతూ కాంగ్రెస్ హామీలను నమ్మొద్దని ప్రచారం చేస్తున్నది. హర్యానాలో ఈ ప్రచారం ఫలించింది. రేపు మహారాష్ట్రలోనూ ఇది తమను ముంచేస్తుందేమోనని కాంగ్రెస్ నేతలు కలవరపడుతున్నారు.
కేసీఆర్ పథకాలపై పార్టీల ఆసక్తి
మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలిచిన అన్ని పార్టీలకు ఇప్పుడు కేసీఆర్ మాడల్ ఆకర్షణీయంగా మారిందని ఆ రాష్ట్ర షేత్కారీ సంఘటన్లు(రైతు సంఘాలు) చెప్తున్నాయి. కేసీఆర్ హయాంలో 10 ఏండ్లలోనే తెలంగాణ అభివృద్ధి చెందిన తీరును, అమలైన పథకాలను చూసిన సరిహద్దులోని వందలాది గ్రామాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేశారు. మహారాష్ట్ర ప్రజలకు ఇంతలా నచ్చిన కేసీఆర్ మాడల్ పథకాల లాంటివి అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వాలని అజిత్ పవార్ లాంటి నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ మాడల్ కాంగ్రెస్ నేతలకే చుక్కలు చూపిస్తున్నది.