Saifuddin Soz | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను మొదలుకుని కాంగ్రెస్ నేతలు పాక్‌కు మద్దతుగా ప్రకటనలు చేయడం వివాదాస్పదమవుతున్నది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సైఫుద్దీన్ సోజ్ తాజాగా మాట్లాడుతూ, ‘సింధూ నదీ జలాలు పాకిస్థాన్‌కు అత్యంత కీలకం. ఆ ఒప్పందాన్ని భారత్ కొనసాగించాలి. ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాక్ మాటల్ని మనం అంగీకరించాలి. సింధూ నదీ జలాలు పాక్‌కు జీవనాడి’ అని అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ, మతం గురించి అడిగి ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై సందేహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు అంత సమయముంటుందా? అని ఎదురు ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు షాకింగ్‌కు గురిచేస్తున్నాయని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. ‘పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయాన్ని తెలిపే సాక్ష్యాలన్నీ మరిచిపోవాలని సోజ్ చెబుతున్నారు. పాక్ చెప్పే మాటల్ని మాత్రమే నమ్మాలని ఆయన అంటున్నారు’ అని మాలవీయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలన్నీ వారి వ్యక్తిగతమని, పార్టీతో సంబంధం లేదని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.