(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల సమయంలో రోజుకో కాంగ్రెస్ సీనియర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. మొన్నటికి మొన్న ‘వారసత్వ పన్ను’, ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, నిన్న ‘దేశంలో నీగ్రోలు ఉన్నారం’టూ మరో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మరో వివాదానికి తెరతీశారు. తాజాగా మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ భారత్-పాక్ సంబంధాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
‘పాకిస్థాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి, ఆ దేశాన్ని మనం గౌరవించాలి. అలా చేయని పక్షంలో భారత్‌పై అణ్వస్త్రం ప్రయోగించాలన్న ఆలోచన ఆ పిచ్చివాళ్లకు (పాక్) వస్తుంది. అదే జరిగితే, మనకే నష్టం. మనదగ్గర కూడా అణ్వాయుధాలు లేవని నేను అనట్లేదు. అయితే, లాహోర్‌పై మనం అణుబాంబు వేస్తే.. దాని తాలూకు రేడియేషన్ మన అమృత్సర్ను చేరడానికి 8 సెకండ్లు కూడా పట్టదు. కాబట్టి, పాకిస్థాన్‌తో మనం చర్చలు జరుపాలి. అంతేగానీ, సైన్యంతో వారిని కవ్వింపులకు గురిచేసి రెచ్చగొట్టొద్దు. అలా చేస్తే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. దీంతో మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అంటూ గత నెలలో ఓ ఇంటర్వ్యూలో అయ్యర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ బాలాకోట్ దాడి గురించి ప్రస్తావిస్తూ.. పాక్‌ను పరోక్షంగా హెచ్చరించిన సందర్భంగా అయ్యర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతాలు బయటపడుతున్నాయని దుయ్యబట్టింది. అయ్యర్ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో కాంగ్రెస్ కూడా స్పందించింది. ఆ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీ విభేదిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో బీజేపీపై ఎదురుదాడికి దిగారు. భారత్ కంటే చైనాది పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇప్పుడు వారితో గొడవకు దిగలేమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గతంలో పేర్కొన్న వీడియోను పోస్ట్ చేసిన ఖేరా.. బీజేపీ వైఖరిని ఎండగట్టారు.