Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ లిస్టులో సీనియర్ నేతలు, లింగాయత్ కమ్యూనిటీ ప్రముఖలైన జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవది వంటి వారు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ కీలక అంశం కర్ణాటక రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. ఏండ్లుగా బీజేపీకి మద్దతుగా లింగాయత్‌లను వ్యూహాత్యకంగా పక్కనబెట్టి.. ఈసారి బ్రాహ్మణ నేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ పావులు కదుపుతున్నదని, ఇందులో భాగంగానే లింగాయత్ నేతలను పక్కనబెడుతున్నదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే పరిణామాలు చోటుచేసుకోవటం గమనార్హం. యెడియూరప్పకు ప్రాధాన్యం తగ్గించడం, ఎన్నికల్లో గెలిస్తే ప్రస్తుతం సీఎంగా ఉన్న బొమ్మైనే కొనసాగిస్తామనే మాట చెప్పకపోవడం, లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో ఈ అంశం ప్రజల్లోకి, ప్రధానంగా లింగాయత్ వర్గంలోకి బలంగా వెళ్తుండటంతో కమలం పార్టీ కలవరపడుతున్నది.
కర్ణాటకలో పీష్వా (బ్రాహ్మణుల) పాలనకు బీజేపీ వ్యూహం పన్నిందని, పీష్వా కమ్యూనిటీ నేతను సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నదని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఇటీవల చేసిన వ్యాఖ్యలు లింగాయత్‌లలో బీజేపీ అడుగుల పట్ల అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రహ్లాద్ జోషీని సీఎం గద్దె ఎక్కించాలని బీజేపీ అధినాయకత్వం చూస్తున్నదని బాంబు పేల్చారు. దీంతో నష్టనివారణ కోసం బీజేపీ నాయకత్వం ఎన్నికల ప్రచారంలో యెడియూరప్పకు ప్రాధాన్యం కల్పించింది. గత అనుభవాల దృష్ట్యా యెడియూరప్పకు అధిష్ఠానంపై అసంతృప్తి ఉన్నప్పటికీ కుమారుల రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా, కేసుల నుంచి తప్పించుకునేందుకు అన్యమనసంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు.
కర్ణాటకలో లింగాయత్‌లు దాదాపు 17 శాతం, బ్రాహ్మణులు 4 శాతం ఉంటారని అంచనా. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో లింగాయత్‌లదే కీలక పాత్ర. బీజేపీ అంటే లింగాయత్‌ల పార్టీగా పేరు ఉన్నది. ఐదారేండ్ల కిందటి వరకూ ఆరెస్సెస్‌లోనూ వారికి ఆధిపత్యం ఉన్నది. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో యెడియూరప్పను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే ప్రచారానికి నాంది పలికారు. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై కూడా లింగాయత్ వర్గ నేతే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆయన్ను లేదా లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతకే సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. కర్ణాటక బీజేపీపై ఆధిపత్యానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కలిసి కుట్ర పన్నారన్న విమర్శ బలంగా ఉన్నది.
ఎన్నికల వేళ లింగాయత్ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పార్టీని వీడడంతో నష్ట నివారణకు కమలం పార్టీ నానాతంటాలు పడుతున్నది. ఓటు బ్యాంకుకు పడిన గండిని పూడ్చుకొనేందుకు లింగాయత్ నేతల్లో ఒకరిని సీఎంగా నియమిస్తారనే ప్రచారాన్ని చేపట్టాలని ఆ పార్టీకి చెందిన మాజీ సీఎం యెడియూరప్ప నాయకత్వంలోని లింగాయత్ ప్రముఖుల సమావేశం బీజేపీ అధిష్ఠానానికి సిఫార్సు చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలో మాత్రం తీర్మానించలేదు. అయితే ఈ తీర్మానాన్ని అధినాయకులు ఎంతవరకు స్వీకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తమ సమావేశం చేసిన సిఫార్సును అంగీకరించి, అమలు చేయకపోతే పార్టీకి ఓటమి తప్పదనే విషయాన్ని పరోక్షంగా అధిష్ఠానానికి తెలిపామని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తెలిపారు. అటు రాష్ట్రంలో గురువారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది.