హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికే అవమానంతోపాటు అరిష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీలో అదానీ వాటా ఎంతో నిగ్గుతేల్చాలని ఆయన ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ‘అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు. భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు. ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా? తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు’ అని ఆయన నిప్పులు చెరిగారు. రామన్నపేటలో తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలన్నారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తుల్లో భడే భాయ్ వాటా ఎంత? అదానీ భాయ్ వాటా ఎంత? హైకమాండ్ వాటా ఎంత? తేల్చాలని ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని పరోక్షంగా ప్రశ్నించారు.