(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాదిరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, బకాయిలను మాఫీ చేయాలంటూ ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన బాట పట్టారు. యోగీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏప్రిల్ 2023 నుంచి రైతులెవరూ బిల్లులు కట్టనవసరం లేదని గతంలో ప్రకటించింది. అయితే ఇంతవరకు విద్యుత్తు బిల్లులు రద్దు చేస్తున్నట్టు కానీ, దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు కానీ జారీ చేయలేదు.
తన హామీ మేరకు వ్యవసాయ బావుల కరెంటు బిల్లులను రద్దు చేస్తున్నట్టు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేస్తారని తాము కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసామని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కరెంటు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులందరూ సంఘటితంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతారని ప్రకటించారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది రైతులు ప్రభుత్వ ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారని యూపీ రాష్ట్ర విద్యుత్తు వినియోగదారుల మండలి అధ్యక్షుడు అవధేష్ వర్మ పేర్కొన్నారు.