MUDA Scam | బెంగళూరు, ఆగస్టు 31: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూ కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం సిద్ధరామయ్య చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2020లో స్థలాల కేటాయింపు కోసం జరిగిన ముడా సమావేశంలో పార్వతికి స్థలాల కేటాయింపు విషయం చర్చకే రాలేదని బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి మీటింగ్ మినిట్స్‌ను, సమావేశానికి సంబంధించిన ఆడియో రికార్డింగులను ఆయన విడుదల చేశారు. పార్వతికి స్థలాల కేటాయింపు గురించి ఆడియోలో, మీటింగ్ మినిట్స్‌లో ఎక్కడా లేదని, అసలు నిర్ణయమే తీసుకోలేదని రవికుమార్ ఆరోపించారు. కాగా, ముడాలో కీలకంగా పని చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వారికి సిద్ధరామయ్య సర్కారు పదోన్నతులు కల్పిస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స పేర్కొన్నారు. ముడా కమిషనర్‌గా పని చేసిన జీటీ దినేశ్ కుమార్‌ను హవేరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎందుకు నియమించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ముడాకు సంబంధించిన ఫైళ్లను మంత్రి బైరాతి సురేశ్ తీసుకెళ్లి, నాశనం చేశారని ఆయన ఆరోపించారు.
ముడా స్కామ్‌లో తనపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్ ముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆందోళనకు దిగారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ముందు బైఠాయించి, నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు సిద్ధరామయ్య ఆరోపించారు.
పార్టీలో సంక్షోభం తలెత్తుతుందనే సీఎం మార్పుకు కాంగ్రెస్ వెనుకంజ
ముడా స్థలాల కేటాయింపు, ఖర్గే ట్రస్టు భూ కేటాయింపు, వాల్మీకి బోర్డు నిధుల దారి మళ్లింపు వంటి కుంభకోణాలతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట మసకబారింది. స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై త్వరలో విచారణ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎం పీఠం నుంచి దించేస్తారనే ప్రచారం కర్ణాటక కాంగ్రెస్‌లో జోరుగా సాగింది. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఈ ధైర్యం చేసే అవకాశాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
సిద్ధరామయ్యను తప్పిస్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఏర్పడే పోటీతో పార్టీలో సంక్షోభం తలెత్తుతుందనే ఆందోళన హైకమాండ్‌లో ఉందంటున్నారు. డీకే శివకుమార్ వర్గం, సిద్ధరామయ్య వర్గం మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతుందని చెప్తున్నారు. పైగా అహిందా(మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, దళితులు) వర్గాలు దూరమవుతాయనే ఆలోచనతోనూ హైకమాండ్ ఉందంటున్నారు. కర్ణాటకలో నాయకులకు కాంగ్రెస్ అవసరం లేదని, కాంగ్రెస్‌కే నాయకుల అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ముడా, వాల్మీకి, ఖర్గే ట్రస్టు కుంభకోణాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వరుసగా చుట్టుముడుతున్న ఆరోపణలతో సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకుంటారనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మంతనాలు మొదలయ్యాయి. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు హోంమంత్రి పరమేశ్వర శుక్రవారం మంత్రి సతీశ్ జార్కిహోళి ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే పరమేశ్వరను సీఎం చేయాలనే డిమాండ్‌ను అధిష్ఠానం ముందుంచాలని సతీశ్ జార్కిహోళి సహా సిద్ధరామయ్య వర్గీయులు భావిస్తున్నారు. ఈ దిశగానే ఈ సమావేశంలో చర్చలు జరిగినట్టు సమాచారం.