Karnataka | బెంగళూరు, ఆగస్టు 18: ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈనెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎంవో ఆదివారం ప్రకటన విడుదల చేసింది. విధాన సౌధ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది. భేటీపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేసు వాస్తవాలు, అసలు ఏం జరుగుతుందనే దానిపై సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు వివరిస్తారని తెలిపారు. ఈ కేసును న్యాయపరంగా, రాజకీయంగా ఎదుర్కొనే విషయంపై ఒక వ్యూహాన్ని రూపొందిస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సగం మంది బీజేపీ నేతలు వచ్చే ఆర్నెల్లలో జైల్లో ఉంటారని లేదా బెయిల్ కోసం పరుగులు పెడతారని ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిపై తమ సర్కార్ లోతుగా దర్యాప్తు చేయనున్నదని అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బీజేపీ నేతలపై 35కు పైగా కేసులు నమోదయ్యాయని, 3-4 కేసుల్లో మధ్యంతర నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు.
చెన్నై: ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ ఆదివారం గుండెపోటుతో మరణించారు. అకస్మాత్తుగా అస్వస్థతగా ఉన్నట్లు ఆయన చెప్పడంతో రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్లో చేర్చగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కోస్ట్ గార్డ్ నిర్వహించే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు రాకేశ్ పాల్గొనవలసి ఉంది. రాకేశ్ మరణ వార్త తెలిసిన వెంటనే రాజ్‌నాథ్ దవాఖానకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి జయంత్యుత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాణెం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ చెన్నైకి వచ్చారు.