ఢిల్లీలోని జహంగీర్‌పూరీ కూల్చివేతలపై బెంగాల్ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. తమకు బుల్డోజర్లు అవసరం లేదని తేల్చి చెప్పారు. తాము ప్రజల్లో విభజన తీసుకురావాలని భావించడం లేదని ప్రకటించారు. ప్రజలను కలిపి ఉంచడానికే తాము ఇష్టపడతామని ఆమె పేర్కొన్నారు. ఐకమత్యమే తమ బలమని, ఐకమత్యంగా ఉంటేనే సాంస్కృతికపరంగా బలంగా ఉంటామని ఆమె అన్నారు. కానీ.. కలహించుకుంటే మాత్రం పతనమడం ఖాయమని మమత పేర్కొన్నారు. మరోవైపు జహంగీర్ పూర్‌కు తృణమూల్ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. శుక్రవారం అక్కడ టీఎంసీ బృందం పర్యటించి, బాధిత కుటుంబాలతో చర్చించనుంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్‌పురిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేత ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. షాపులు, ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని తాము ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా ఎలా బుల్డోజర్లకు పని పెట్టారని ఇవాళ సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రశ్నించింది. ఆ అంశాన్ని తీవ్రంగా పరిగణించనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇవాళ కేసును విచారించింది. ఎన్డీఎంసీ మేయర్‌కు కూల్చివేత ఆపేయాలని ఆదేశాలు పంపినా, ఎలా నిర్మాణాల కూల్చివేత కొనసాగించారని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం పేర్కొన్నది.