ముంబై : 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ముంబైలో శరద్ పవార్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు.
దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత. దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదు. దళితుల వికాసం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేదు. అందుకే దేశం కోసం.. సరైన అజెండ ఉండాలి. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నేత శరద్ పవార్. తెలంగాణ ఏర్పాటులోనూ శరద్ పవార్ ఇచ్చిన మద్దతును ఎప్పటికీ మరవలేం. ఖచ్చితంగా తమతో కలిసి పనిచేస్తా అన్నారు. అందరం మళ్లీ భేటీ అవుతాం. ఇంకా ఇతర నేతలతో కూడా మాట్లాడి ముందుకు వెళ్తాం. అందరినీ కలుపుకొని వెళ్తాం. కొన్ని రోజుల తర్వాత ప్రజల ముందు మా అజెండ పెడతాం.. మా కార్యచరణ ఏంటో త్వరలోనే తెలియజేస్తాం.. అని సీఎం కేసీఆర్ తెలిపారు.