CM KCR | తెలంగాణలో వచ్చినా మార్పు దేశమంతా రావాల్సి ఉందని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సర్కార్ వస్తేనే దేశంలో మార్పు వస్తుంది. బీఆర్ఎస్కు అధికారం ఇస్తే రెండేండ్లలోనే మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్ ఇస్తాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ చిన్న దేశమైన జింబాబ్వేలో ఉంది అని కేసీఆర్ తెలిపారు. చాలా దేశాల్లో 5 వేల టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన దేశంలో ఈ స్థాయిలో ప్రాజెక్టులు లేవు. ఇంత విశాల భారత్లో కనీసం 2 వేల టీఎంసీల రిజర్వాయర్ ఎందుకు లేదు? అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో రిజర్వాయర్లు కాదు.. జల వివాదాలు, ట్రిబ్యునళ్లు పెరిగిపోయాయి. కేంద్రం ట్రిబ్యునళ్లు వేసి చేతులు దులుపుకుంటుంది. రాష్ట్రాల మధ్య జల వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదు. ట్రిబ్యునళ్ల పేరుతో సంవత్సరాల కొద్ది జల వివాదాలు పెండింగ్లో పెడుతారు. ట్రిబ్యునళ్ల పేరుతో ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వకుండా తిప్పుతారు.
చిత్తశుద్ధితో కృషి చేస్తే దేశంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. గట్టిగా అనుకుంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వొచ్చు. 8 ఏండ్ల క్రితం తెలంగాణలోనూ ఎన్నో సమస్యలు ఉండేవి. కొన్నేండ్ల క్రితం తెలంగాణలో సాగు, తాగునీరు, విద్యుత్ కొరత ఉండేది. తెలంగాణలో క్రమంగా అన్ని సమస్యలను అధిగమించాం. తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నాం. రైతు ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల బీమా ఇస్తున్నాం. తెలంగాణలో ఇంటింటికి సురక్షిత తాగునీటిని నల్లా ద్వారా అందిస్తున్నాం. ఇవన్నీ తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. మీకు ఈ పథకాలన్నీ కావాలా.. వద్దా..? ఇలాంటి పథకాలు కావాలంటే రైతు సర్కార్ రావాలి. దేశంలో పుష్కలంగా బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గుతో దేశమంతటా 24 గంటల కరెంట్ ఇవ్వొచ్చు అని కేసీఆర్ స్పష్టం చేశారు.