బిహార్ చేరుకున్న సీఎం కేసీఆర్.. గల్వాన్ ఘర్షణల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి వాళ్లకు చెక్కులు అందజేశారు. అనంతరం ఇద్దరు సీఎంలు జాయింట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందరన్న కేసీఆర్.. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనమైందని చెప్పారు. రైలుతు, పేదలు, మహిళలు ఏ ఒక్కరికీ మోదీ సర్కారు ఏం చెయ్యలేదన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న నదుల్లో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, కానీ వాటిని ఉపయోగించుకునే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని విమర్శించారు. దేశరాజధాని ఢిల్లీలో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు తీర్చలేదని ఎద్దేవా చేశారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా ఉపయోగించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీజేపీ ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటోందని ప్రశ్నించారు. బీజేపీ మంచి చేసి ఉంటే రైతులు ఉద్యమించే వారు కాదు కదా అన్నారు. ధరలు పెరగడంతో పేదలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని, బీజేపీ ముక్త్ భారత్ ఏర్పాటు కోసం కృషి చేయాలని చెప్పారు. మేకిన్ ఇండియా అన్నారని, కానీ గాలి పటాలు ఎగరేసే మాంజా కూడా చైనా నుంచే దిగుమతి అవుతోందని విమర్శించారు.