GDP | న్యూఢిల్లీ, నవంబర్ 1: వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతున్న కార్మిక ఉత్పాదకతలు ఈ నష్టానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.
తక్కువ ఆదాయ, దుర్భల ఆర్థిక వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. 2070 నాటికి తీర ప్రాంతాల్లో వరదల వల్ల ఈ ప్రాంతంలోని 30 కోట్ల మంది ప్రమాదంలో పడతారని.. కోట్లాది రూపాయల తీర ప్రాంత ఆస్తులు దెబ్బ తినొచ్చని చెప్పింది. 2000 నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారంలో అభివృద్ధి చెందుతున్న ఆసియా వాటా ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది.