Bengaluru | బెంగళూరు: అసలే గోతులతో నిండిన రోడ్లు.. ఆపై భారీ వర్షాలు.. ఇంకేముంది ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి కర్ణాటక రాజధాని బెంగళూరు రహదారులు. తాజాగా బెంగళూరు తూర్పు సబర్బన్‌కు చెందిన వర్తూరులోని ఒక వీధిలో దివ్యాంగ మహిళ ఒకరు మూడు చక్రాల స్కూటర్‌పై వస్తూ నీటితో నిండిన రోడ్డుపై అదుపుతప్పి గోతిలో పడిపోయింది. దీంతో గోతిలోంచి బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న ఆమెకు స్థానికులు సహాయం చేశారు. దీంతో రోడ్ల దుస్థితిపై నెటిజన్లు కాంగ్రెస్ నేతృత్వంలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదేనా బ్రాండ్ బెంగళూరు? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
బెంగళూరును ముంచెత్తిన వానలు
బెంగళూరులో మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలకు 5 మంది మరణించారు. పలు నివాస ప్రాంతాలు, రోడ్లపై మోకాలి లోతు నీళ్లు చేరాయి. మంగళవారం కేవలం 6 గంటల సమయంలో యెలహంకలో 157 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.బాబుసాపాళ్యలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, ఇద్దరిని రక్షించారు. మరో 12 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.