Arunachal Pradesh | 2022, డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా బలగాల మధ్య భౌతిక దాడులు జరిగాయి. పీఎల్ఏ ఆర్మీ భారత్‌లోకి చొరబాటుకు యత్నించడం వల్లే ఈ ఘర్షణలు చెలరేగాయి. తవాంగ్‌లో పలు రోడ్లు, గ్రామాలను చైనా అప్పటికే నిర్మించింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదు. చైనా తీరును ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నది.
వారం రోజుల తర్వాత.. అరుణాచల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్‌లోని పలు ఎయిర్‌బేస్‌లలో అత్యాధునిక డ్రోన్లు, జెట్ విమానాలను చైనా మోహరించింది. దీంతో సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయా? అనే భయాలు నెలకొన్నాయి. అయినప్పటికీ, శత్రువులను ఎదుర్కొనే వ్యూహాలకు కేంద్రం పథకరచన చేయలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): దురాక్రమణ కాంక్షతో భారత్‌లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన ప్రాంతాల పేర్లు మార్చడం వంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతూ డ్రాగన్ దేశం పలుమార్లు హద్దు మీరింది. అయినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఖండనలకే పరిమితమవుతున్నదని ప్రతిపక్షాలతో సహా మేధావులు కూడా మండిపడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై చైనా తీరును ఎండగట్టడంలో కేంద్రం విఫలమవుతున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తాజా వైఖరితో ఇది మరోసారి రుజువైంది.
అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు చైనా ఆదివారం కొత్త పేర్లు పెట్టింది. ఈ పేర్లు చైనా, టిబెట్, పిన్యిన్ భాషల్లో ఉన్నాయి. పేర్ల మార్పు జాబితాలో 2 భూభాగాలు, 2 నివాస ప్రాంతాలు, 5 పర్వతాలు, 2 నదులున్నాయి. చైనా దుందుడుకు చర్యను ఎప్పటిలాగే కేంద్రం మంగళవారం ఖండించింది. అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. కొత్త పేర్లు పెట్టడం వల్ల వాస్తవాలు మారవని మొక్కుబడి ప్రకటన చేసింది. చైనా ఆగడాలకు కళ్లెం వేయడంలో కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరించట్లేదని నిపుణులు మండిపడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై చైనా తీరును గతంలోనే ఎండగట్టినైట్లెతే, డ్రాగన్ దూకుడుకి కళ్లెం పడేదని, 2017, 2021 ‘పేర్ల మార్పు’ ఘటనలను గుర్తు చేస్తున్నారు.
2017లో అరుణాచల్‌లోని 6 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను ప్రకటించింది. దీన్ని భారత్ ఖండించిందే తప్ప, చైనా తీరును అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడంలో విఫలమైంది. మరింత హద్దుమీరిన చైనా 2021లో అరుణాచల్‌లోని 15 ప్రాంతాలకు కొత్త పేర్లను విడుదల చేసింది. అప్పుడు కూడా కేంద్రం ఇదే మెతక వైఖరిని ప్రదర్శించింది. ఖండనలతోనే సరిపుచ్చింది. దీంతో చైనా ఆగడాలు శృతిమించాయి. ఫలితంగానే, కిందటేడాది సరిహద్దుల్లో గ్రామాలను నిర్మించి, యుద్ధ విమానాలను డ్రాగన్ మోహరించింది.
2వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది. మన భూభాగాల పేర్లను ఇష్టారీతిన మార్చివేస్తున్నది. అయినప్పటికీ, ప్రధాని మౌనంగా ఉంటూ ఎందుకు అంతగా భయపడుతున్నారు?
– కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ