India | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): డ్రాగన్ దేశం చైనా చక్రబంధంలో భారత్ చిక్కుకుపోయింది. ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమవ్వడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌కు పొరుగున ఉన్న దాదాపు అన్ని దేశాలూ చైనాకు అనుకూలంగా మారడం గమనార్హం. శ్రీలంకలో తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనుర కుమార దిసనాయకే మార్క్సిస్ట్ నేత. ఇక, మాల్దీవుల్లో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు వ్యతిరేకిగా పేరుపొందిన మహమ్మద్ ముయిజ్జు గెలిచి అధ్యక్షుడయ్యారు. చైనా నుంచి పెద్దయెత్తున రుణాలు వస్తుండటంతో వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
సరిహద్దు కయ్యాలతో భారత్‌లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా లోగుట్టు మైత్రీ బంధం బహిరంగ రహస్యమే. ఇక, బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఇటీవల ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం, గతంలో చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొన్న భూటాన్‌తో పాటు మారిషస్ కూడా చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఇప్పుడు సత్సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. వెరసి భారత్ చుట్టూరా ఉన్న పొరుగు దేశాలన్నీ ఇండియాను కాదని చైనా స్నేహ హస్తాన్ని కోరుకోవడం ‘భారత్‌ను ఒక విధంగా చక్ర బంధంలో బంధించడమే’నని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డ్రాగన్ కుయుక్తులను తిప్పికొట్టడంలో మోదీ ఫెయిలయ్యారని చెప్తున్నారు.
భారత్
పొరుగున చైనా అనుకూల ప్రభుత్వాలు
దేశం: భూటాన్
ప్రధాని: త్సెరింగ్ తోబ్గే
పార్టీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ
దేశం: శ్రీలంక
అధ్యక్షుడు: అనుర కుమార దిసనాయకే
పార్టీ: జనతా విముక్తి పెరమున
దేశం: మాల్దీవులు
అధ్యక్షుడు: మహమ్మద్ ముయిజ్జు
పార్టీ: పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్
దేశం: పాకిస్థాన్
అధ్యక్షుడు: ఆసిఫ్ అలీ జర్దారీ
పార్టీ: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
దేశం: ఆఫ్ఘనిస్తాన్
సుప్రీం లీడర్: హిబాతుల్లా అఖుంద్జాదా, పార్టీ: తాలిబాన్
దేశం: మారిషస్
అధ్యక్షుడు: ప్రవింద్ జుగ్నౌత్, పార్టీ: మిలిటెంట్ సోషలిస్ట్ మూమెంట్
దేశం: బంగ్లాదేశ్
ప్రభుత్వ సలహాదారు: మహమ్మద్ యూనస్
పార్టీ: స్వతంత్ర కూటమి