ఉత్తరాఖండ్: వైద్యుల నిర్లక్యం ఏడాది బిడ్డ ప్రాణం తీసింది. పిల్లాడిని చూడకుండానే దవాఖానాలను మార్చిమార్చి రిఫర్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం చివరికి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో జరిగిందీ ఘటన. విషయం వెలుగులోకి వచ్చి విమర్శలు వెల్లువెత్తడంతో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ధామి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఏడాది వయసున్న శివాన్ష్జోసి గత నెల 10న డీహైడ్రేషన్‌తో బాధపడుతూ వాంతులు చేసుకున్నాడు. తల్లి పాలు కూడా తాగడం మానేశాడు. దీంతో వెంటనే ఆ చిన్నారి తల్లి సమీపంలోని పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. అక్కడ చిన్నపిల్లల వైద్యులు లేకపోవడంతో అక్కడికి 22 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు రిఫర్ చేశారు. శివాన్ష్‌కు అక్కడ చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేశ్వర్‌లోని జిల్లా దవాఖానకు రిఫర్ చేశారు.
జిల్లా దవాఖానలోని ఎమర్జెన్సీ వార్డుకు చిన్నారిని తీసుకొస్తే అక్కడి డ్యూటీ డాక్టర్ మొబైల్ ఫోన్లో మునిగిపోగా, నర్సులు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ కనిపించారు. ఎవరూ ఆ చిన్నారిని పట్టించుకోలేదు. అక్కడా చిన్నారిని కనీసం పరీక్షించకుండానే పీడియాట్రిక్ ఐసీయూ యూనిట్ లేదని చెప్పి అల్మోరాలోని దవాఖానకు రిఫర్ చేశారు. దీంతో అక్కడికి తీసుకెళ్లేందుకు ఏడు గంటలకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే రెండున్నర గంటల ఆలస్యంగా వచ్చింది. అదికూడా జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫోన్ చేసి సాయం కోరిన తర్వాత. ‘మెరుగైన చికిత్స కోసం 108కి కాల్ చేయమని వైద్యులు చెప్పడంతో నేను ఫోన్ చేశాను. కానీ, ఫలితం లేకుండా పోయింది.
నా భర్త దినేశ్చంద్రజోషి జమ్ముకశ్మీర్‌లో డ్యూటీలో ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను. అంబులెన్స్ రాలేదని నేను వైద్యుడికి చెప్పాను. దవాఖాన సిబ్బంది మాకు సాయం చేయలేదు. మా విన్నపాలను వారు పట్టించుకోలేదు’ అని చిన్నారి తల్లి వాపోయింది. రాత్రి 9.30 గంటలకు అంబులెన్స్ వచ్చాక నాలుగో దవాఖాన అయిన అల్మోరా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లామని, కానీ వారు నైనిటాల్‌లోని హల్దానీకి రిఫర్ చేశారని వివరించింది.
జూలై 12న హల్దానీ వైద్యులు చిన్నారిని వెంటిలేటర్లో ఉంచి చికిత్స చేశారు. అయినప్పటికీ నాలుగు రోజుల తర్వాత జూలై 16న చిన్నారి మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మరణించాడని దినేశ్ చంద్రజోషి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి ధామి ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.