Muda Scam | బెంగళూరు, ఆగస్టు 21/(స్పెషల్ టాస్క్ బ్యూరో): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకొన్న ‘ముడా స్కామ్’లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఈ స్కామ్‌తో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాదించిన సిద్ధరామయ్య మాటలన్నీ అబద్ధమని తేలింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారం బయటకొచ్చింది. తనకు ఖరీదైన ప్రాంతంలో స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరుతూ మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (ముడా) అధికారులకు సిద్ధరామయ్య సతీమణి పార్వతి లేఖ రాశారు. సిద్ధరామయ్య తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఆమె ఈ లేఖ రాసినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు రిపబ్లిక్ కన్నడ న్యూస్ వెబ్సైట్ ఓ కథనంలో ఆధారాలను బయటపెట్టింది.
తనకు ఖరీదైన ప్రాంతంలో స్థలం కావాలంటూ లేఖ రాసిన పార్వతి ఎక్కడ స్థలం కావాలనుకొంటున్నారో ఆ నిర్దిష్ట ప్రాంతాన్ని కూడా లేఖలో స్పష్టం చేశారు. అయితే, దీనిని వైట్నర్తో ఉద్దేశపూర్వకంగా కొట్టివేశారు. ముడా కుంభకోణం బయటపడ్డాకనే ఆధారాలు చెరిపేయాలనే లక్ష్యంతోనే ఇలా కొట్టేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆధారాలను బట్టి.. భర్త సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఖరీదైన ప్రాంతంలో తనకు భూములు కేటాయించాల్సిందిగా పార్వతి కోరినట్టు అర్థమవుతున్నది. దీనికోసం ఆమె సీఎంగా సిద్ధరామయ్య హోదాను వినియోగించుకొన్నట్టు తెలుస్తున్నది. స్కామ్ విషయం బయటకు రాగానే.. కీలకమైన సమాచారాన్ని చెరిపేయడానికి వైట్నర్ను కూడా వాడినట్టు స్పష్టమవుతున్నది. కాగా, మైసూరు శివారుల్లోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3 ఎకరాల 16 గుంటల భూములను అవసరాల దృష్ట్యా సేకరించిన ప్రభుత్వం.. వాటికి బదులుగా నగరం లోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా చెప్పుకొనే విజయనగరలో భూములను కేటాయించింది. కెసరెలోని భూములతో పోలిస్తే మార్కెట్ ధర ఎంతో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్ధరామయ్య కుటుంబానికి ఆ భూములను కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. దీన్నే ‘ముడా’ స్కామ్‌గా పిలుస్తున్నారు.