రాయపూర్ : చత్తీస్ఘఢ్ ఎన్నికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లేందుకు మోదీ సర్కార్ కుట్రపూరితంగా మద్యం స్కామ్‌ను తెరపైకి తెచ్చిందని సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) ఆరోపించారు. రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ సర్కార్ రాష్ట్రంలో 15 ఏండ్లు అధికారంలో ఉందని, ఆయన హయాంలో రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. కాషాయ సర్కార్ పేదలను నిరుపేదలుగా మార్చిందని, బీజేపీ కార్యకర్తలందరూ సంపన్నులుగా ఎదిగారని దుయ్యబట్టారు.
కాషాయ శ్రేణులు ఆస్తులు కూడగట్టుకోవడంపై ఎప్పుడు విచారణ చేపడతారని ఆయన మోదీ సర్కార్‌ను నిలదీశారు. మీరు ఆ పని ఎన్నడూ చేయరని తమ నేతలు వినోద్ తివారీ, ఆర్పీ సింగ్ నివాసాలపై దాడులు చేస్తారని మండిపడ్డారు. వీరి నుంచి ఎంత మొత్తం నగదును జప్తు చేశారో మాత్రం వెల్లడించరని అన్నారు.
ఇక ఈడీ బీజేపీకి రాజకీయ ఏజెంట్‌గా మారిందని భూపేష్ బఘేల్ అంతకుముందు కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీ, ఐటీలను పురిగొల్పుతూ రాజకీయ లబ్ధికి కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. చత్తీస్ఘఢ్ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు రాష్ట్రంలోనే మకాం వేసి కుట్రలకు తెరలేపుతాయని తాను ముందే చెప్పానని ఆయన పేర్కొన్నారు.
Read More