DY Chandrachud | దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం (Air Pollution) కమ్మేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెట్టడానికి తోడు.. పొగ మంచు రాజధాని ప్రాంతాన్ని కమ్మేయడంతో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం తగ్గడంలేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandrachud) ఆందోళన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు తెలిపారు. ‘నేటి నుంచి నేను మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశా. సాధారణంగా నేను ఉదయం 4 నుంచి 4.15 మధ్య వాకింగ్‌కు వెళ్తాను. ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే మంచిదని నా వ్యక్తిగత వైద్యుడి సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లోనే ఉండటం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు’ అని సీజేఐ తెలిపారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకి ఢిల్లీలో గాలి నాణ్యత 283 వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) తెలిపింది. ఆనంద్ విహార్‌లో 218, పంజాబీ బాగ్‌లో 245, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 276, జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 288గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. గత రెండు రోజులుగా రాజధానిలో కాలుష్యం పెరిగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వాపోతున్నారు.
కాగా, డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన 2022 నవంబర్ 8 నుంచి ఈ పదవిలో ఉన్నారు. చంద్రచూడ్ తర్వాత భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 11న సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు.
Also Read..
Air Pollution | క్షీణించిన గాలి నాణ్యత.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు
Anmol Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ను పట్టిస్తే రూ.10 లక్షలు
Zeeshan Siddique: ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిక్ కుమారుడు జీషాన్ సిద్ధిక్