న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్(Anmol Bishnoi) తలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రివార్డు ప్రకటించింది. అతన్ని పట్టిస్తే పది లక్షలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నది. అన్మోల్ బిష్ణోయ్‌ని అలియాస్ భానుగా పిలుస్తారు. నకిలీ పాస్పోర్టుతో అతను ఇండియా నుంచి పారిపోయాడు. గత ఏడాది కెన్యాలో అతన్ని గుర్తించారు. ఈ ఏడాది కెనడాలోనూ కనిపించాడతను. పంజాబీ సింగర్ సిద్దూ మోసేవాల్ హత్య కేసులో అన్మోల్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.
అన్మోల్‌పై మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఫైరింగ్ కేసులో ముంబై పోలీసులు అన్మోల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ ఫైరింగ్‌కు పాల్పడింది తామే అని అతను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.