ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కుమారుడు జీషాన్ సిద్ధిక్(Zeeshan Siddique).. అజిత్ పవార్‌కు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఆగస్టులో జీషాన్‌ను వెలివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో ఆ చర్య తీసుకున్నది. బాంద్రా ఈస్ట్ నుంచి జీషాన్ ఎన్సీపీ టికెట్‌పై పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఆ స్థానం నుంచి వరుణ్ సర్దేశాయ్పై పోటీ చేసి గెలిచారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే మేనేల్లుడు వరుణ్‌పై ఆయన విజయం సాధించారు. తన తండ్రి బాబా సిద్ధిక్ హత్యకు గురైన తర్వాత కాంగ్రెస్ కూటమి తనను బహిష్కరించిందని జీషాన్ తెలిపారు. తనకు, తన కుటుంబానికి ఇది భావోద్వేగభరితమైన రోజు అని, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునిల్ తత్కరేలకు రుణపడి ఉన్నట్లు పేర్కొన్నారు. బాంద్రా ఈస్ట్ నుంచి తనకు సీటు వచ్చిందని, ప్రజల అభిమానంతో మళ్లీ గెలుస్తానన్న నమ్మకం ఉందని జీషాన్ సిద్ధిక్ తెలిపారు. అక్టోబర్ 12వ తేదీన జీషాన్ సిద్ధిక్ ఆఫీసు వద్ద బాబా సిద్ధిక్ హత్య జరిగిన విషయం తెలిసిందే.