రాయ్‌పూర్, జనవరి 23 : కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బాలో చోటుచేసుకుంది. రెండు గ్రామాలను కలుపుతూ 40 ఏండ్ల క్రితం నిర్మించిన 60 అడుగుల ఇనుప వంతెన కొర్బాలో హఠాత్తుగా అదృశ్యమైంది. శనివారం రాత్రి వరకు దానిపై రాకపోకలు సాగించారు. తీరా ఆదివారం ఉదయం చూడగా, అక్కడ బ్రిడ్జి ఉన్న ఆనవాళ్లు కూడా లేవు.
30 టన్నుల ఈ బ్రిడ్జిని కొందరు చోరులు రాత్రికి రాత్రే విప్పేసి అపహరించుకుపోయారు. చోరులు గ్యాస్ కట్టర్లతో ఈ బ్రిడ్జి స్తంభాలను, ఇతర భాగాలను కత్తించారు. ఒక మంచినీటి పైపులైన్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన 40 అడుగుల బీమ్‌ను కూడా వీరు కట్ చేశారు. అయితే అదృష్టవశాత్తు పైపులైన్‌కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇనుప తుక్కు వ్యాపారులు పలువురిని విచారించామని, కానీ శుక్రవారం వరకు చోరుల ఆచూకీ తెలియరాలేదని పోలీసులు తెలిపారు.