ఇంఫాల్, సెప్టెంబర్ 4: కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతీ వర్గాల సంఘర్షణ ఇప్పుడు డ్రోన్ దాడులకు విస్తరించింది. రాష్ట్ర పోలీసులు ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ)లను ఆశ్రయించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగారాజధాని ఇంఫాల్‌లో పౌరులు, భద్రతా దళాలు లక్ష్యంగా కొందరు డ్రోన్ల ద్వారా దాడికి పూనుకున్నారు. ఈ దాడితో మైతీ, కుకీ జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణ కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో గత కొన్ని రోజులుగా జరిగిన ఈ డ్రోన్ దాడులతో ఇద్దరు మరణించారు. ఈ డ్రోన్ల దాడిపై మణిపూర్ ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.