ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్ కోర్టు(Ghaziabad Court) ఇవాళ రణరంగంగా మారింది. జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జీతో పాటు లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత జడ్జీ ఛాంబర్ వద్ద భారీ సంఖ్యలో లాయర్లు గుమ్మిగూడారు. ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. లాయర్లను మరీ వెంటాడి తరిమేశారు. ఆ తర్వాత పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.
పోలీసుల దాడిలో అనేక మంది లాయర్లు గాయపడినట్లు తెలుస్తోంది. పరిస్థితిపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నది. జడ్జీ ఛాంబర్ నుంచి వెళ్లగొట్టిన తర్వాత.. లాయర్లు అంతా ఒక్క దగ్గరకు చేరుకుని ధర్నా చేపట్టారు. భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెయిల్ పిటీషన్‌పై జడ్జి, లాయర్ మధ్య జరిగిన వాగ్వాదం చివరకు గొడవకు దారితీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.