బెంగళూరు, సెప్టెంబర్ 6: చంద్రయాన్-2లోని ఆర్బిటార్ 9వేల సార్లు చంద్రుడిని చుట్టివచ్చిందని ఇస్రో చైర్మన్ కే శివన్ చెప్పారు. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టి రెండేండ్లు గడిచిన సందర్భంగా ఇస్రో రెండు రోజుల లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నది. ఇది సోమవారం ప్రారంభమైంది. చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్ తిరుగుతున్నదని శివన్ చెప్పారు. ఆర్బిటార్ పంపిన ఫొటోలు, సమాచారాన్ని విడుదల చేశారు. ఆర్బిటార్ అత్యంత నాణ్యమైన ఫొటోలను పంపిందన్నారు. చంద్రయాన్-2ను 2019 సెప్టెంబర్ 2న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. చంద్రయాన్-2 ప్రయోగం చివరిక్షణంలో ల్యాండర్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే.