అహ్మదాబాద్, మార్చి 29: అన్నదాతల ఉద్యమానికి జడిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా గుజరాత్లో గిరిజనుల ఆందోళనకు తలొగ్గింది. పార్-తాపి-నర్మదా నదుల అనుసంధాన ప్రాజెక్టుపై వెనకడుగు వేసింది. ప్రాజెక్టును నిలిపివేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే ప్రాజెక్టును నిలిపివేస్తున్నట్టు బీజేపీ సర్కారు నాటకాలాడుతున్నదని కాంగ్రెస్ విమర్శించింది. అనుసంధాన ప్రాజెక్టును నిలిపివేయాలని గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ప్రస్తుతం తామంతా ఒకచోట ఉమ్మడిగా ఉన్నామని, ఈ ప్రాజెక్టు చేపడితే చెట్టుకొకరు, పుట్టకొకరులా బతకాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.