‘పవన్‌కల్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. నేను రికార్డులను మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే కలెక్షన్స్ ఎప్పుడూ విడుదల తేదీపై ఆధారపడి ఉంటాయి. సంక్రాంతికి ఓరకంగా , సమ్మర్లో మరోరకంగా ఉంటాయి. అయితే ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా చూసిన తర్వాత ‘ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది’ అని అందరూ అనుకుంటారు’ అన్నారు దర్శకుడు హరీశ్‌శంకర్. ఆయన నిర్ధేశకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు హరీశ్‌శంకర్ పై విధంగా స్పందించారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నది మా కల. అది ఉస్తాద్ భగత్‌సింగ్‌తో నెరవేరింది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచలేదు.
మామూలు రేట్లకు ఎంత వసూళ్లు వస్తాయో చూద్దామని ఆ ప్రయత్నం చేయలేదు. పవన్‌కల్యాణ్ ఈ సినిమా కోసం ఒక్కోసారి 15 గంటలు కూడా కష్టపడ్డారు. గురువారం ఉదయం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్షోలు ప్రారంభమవుతాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు శ్రీలీల, రాశీఖన్నా పాల్గొన్నారు.